బుధవారం, జూన్ 10, 2015

భూచక్రం

గడిచిన రెండు దశాబ్దాలలో శరవేగంగా విస్తరించిన కొన్ని వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. వ్యవసాయ భూములని వ్యవసాయేతర ప్రయోజనాలకోసం, మరీ ముఖ్యంగా గృహ నిర్మాణాల కోసం వినియోగించడం అన్నది ఒకప్పుడు ఏమాత్రం ఊహించని పరిణామం. నూతన ఆర్ధిక విధానాల కారణంగా కొత్తకొత్త ఉద్యోగాల రూపంలో ఆదాయం పెరిగినట్టుగానే, కొత్తకొత్త ఖర్చు మార్గాలూ పుట్టుకొచ్చాయి. భూమి విలువని అకస్మాత్తుగా పెంచి, డిమాండ్ సృష్టించిన ఈ వ్యాపారం సరికొత్త సామాజిక వర్గాలనీ సృష్టించింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇతివృత్తంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వచ్చాయి. అయితే, విస్తారమైన కేన్వాను వినియోగించుకుని నవలని రాసిన ఘనత మాత్రం 'దామల్ చెరువు అయ్యోరు' మధురాంతకం రాజారాం గారబ్బాయి మధురాంతకం నరేంద్రది. తిరుపతి సమీపంలోని 'కృష్ణానగర్' ప్రాంతంలో గృహనిర్మాణ పనుల్లో జీవితాలని వెతుక్కుంటున్న అనేకరకాల మనుషుల కథలని 'రెండేళ్ళ పద్నాలుగు' గా సంకలనం చేసిన నరేంద్ర, భూ వ్యాపారాన్ని గురించి మరింత లోతుగా పరిశోధన చేసి రాసిన నవల 'భూచక్రం.'

తిరుపతి కేంద్రంగా సాగే కథని రాష్ట్రంలోనే కాదు, దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తున్న ఏ  ప్రాంతానికైనా సులువుగా అన్వయించుకోవచ్చు. వందేళ్ళ కాలంలో వ్యవసాయ భూమి చేతులు మారి మారి ఎలా తన రూపాన్నీ, విలువనీ మార్చుకుందో, మూడు నాలుగు తరాల కాలంలో ఆ భూమి యజమానుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో నిశితంగా చిత్రించిన నవల ఇది. రచయిత చేసిన పరిశోధన, సేకరించిన వివరాలతో పాటు, తనకి తెలిసిన విషయాన్ని ఓ కథలో పొదిగి నవలగా అందించిన తీరూ ముచ్చట గొలుపుతుంది. తెలిసిన నిజాల వెనుక తెలియని కోణాలని తెలియజెప్పే నవల ఇది.


తిరుపతి అనగానే మొదటగా గుర్తొచ్చేది కొండమీద కొలువైన వెంకటేశ్వర స్వామి. కొండంత దేవుడికి భక్తితో కానుకలు సమర్పించుకునే భక్తులకి కొదవలేదు. అయితే, ఈ కానుకలన్నీ నేరుగా స్వామికే సమర్పించే వారు కొందరైతే, తిరుపతిలో ఉన్న మఠాలకి బహూకరించిన వారు మరికొందరు. కానుకలలో ధన, కనక, వస్తు, వాహనాలతోపాటు వ్యవసాయ భూములూ ఉన్నాయి.  అలాంటి ఒకానొక మఠానికి చెందిన వ్యవసాయ భూములని సాగు చేసి, భుక్తిని వెతుక్కోడం కోసం వందేళ్ళ క్రితం తమిళనాడు నుంచి తిరుపతికి వలస వచ్చిన ఇళవరసి అనే స్త్రీది 'భూచక్రం' నవలలో ప్రధాన పాత్ర. కేవలం ఆమె వల్లే, మఠం పేరిట ఉన్న భూమి మనుషుల పేరుమీదకి మారింది.

సంపదని నిలబెట్టుకోవడం కష్టం. అందునా, అది అయాచితంగా వచ్చినది అయినప్పుడు మరీ కష్టం. బహుశా ఈ కారణానికే, ఇళవరసి కొడుకు రాజమన్నార్ రెడ్డి తనకి సంక్రమించిన మఠం భూములని కొద్ది కొద్దిగా తెగనమ్మి జల్సాలకి ఖర్చుచేయడానికి అలవాటు పడ్డాడు. పుత్ర సంతానం లేని రాజమన్నార్ రెడ్డికి ఇల్లరికపుటల్లుడు జనార్ధన రెడ్డి. మామని మించిన వాడు. సరిగ్గా జనార్ధన రెడ్డి సమయంలోనే తిరుపతిలో ఇళ్ళ నిర్మాణం ఊపందుకుంది. రాజమన్నార్ రెడ్డికి భూమి తనకి రావడం వెనుక ఉన్న 'కష్టం' తెలుసు. జనార్ధన రెడ్డికి అదీ తెలియదు. పైగా అత్తింటి సొమ్ము. అడిగేవాడు లేడు. భార్య నోట్లో నాలుకలేని మనిషి కావడంతో ఆస్థంతా హరించుకుపోయింది.

జనార్ధన రెడ్డి అల్లుడు అమిత్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్య పేరిట ఉన్న కొద్దిపాటి భూమినీ అమ్మకానికి పెట్టి ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి అన్నది అతని ఆలోచన. అదిగో, ఆ అమ్మకం సమయంలో తెలుస్తుంది, మావగారి కుటుంబానికి ఒకప్పుడు ఎన్ని భూములు ఉండేవో.. ఇప్పటి రోజుల్లో అయితే వాటి విలువ ఎన్ని కోట్లు ఉండేదో. ఇంతకీ, మిగిలిన ఆ కాస్త భూమినీ అమిత్ రెడ్డి అమ్మగలిగాడా? ఈ ప్రశ్నకి రచయిత జవాబు చెప్పినా, నవల పూర్తిచేశాక ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరీ ముఖ్యంగా ఇళవరసి తో పాటు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ శేషారెడ్డిని మర్చిపోవడం కష్టం.

'ఆంధ్రప్రభ' దినపత్రికలో సీరియల్ గా ప్రచురితమైన 'భూచక్రం' నవలని విజయవాడకి చెందిన 'అలకనంద ప్రచురణలు' ప్రచురించింది. (పేజీలు  151, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి