శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

కొసరు కొమ్మచ్చి

ఇది కొమ్మచ్చుల్లో చివరిది. రమణ వెళ్ళిపోయాక తయారైన 'కొసరు కొమ్మచ్చి' విడుదలైన కొద్ది రోజులకే బాపూ కూడా వెళ్ళిపోయారు. 'రమణా-నేనూ-మా సినిమాలూ' అంటూ ఈ పుస్తకం కోసం బాపూ రాసిన వ్యాసం, బహుశా ఆయన చివరి రచనేమో కూడా. బాపూ వ్యాసంతో పాటు, రమణతో ఐదున్నర దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పంచుకున్న శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి, వాళ్ళిద్దరి పిల్లలు వర ముళ్ళపూడి, అనురాధ ముళ్ళపూడి, ఎమ్బీఎస్ ప్రసాద్, బీవీఎస్ రామారావులు రాసిన వ్యాసాల సంకలనం ఈ 'కొసరు కొమ్మచ్చి.'

పత్రికా, సినీ రచయితా, సినిమా నిర్మాత ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ 'కోతి కొమ్మచ్చి' ఓ సంచలనం. ఎందరికో స్పూర్తివంతం కూడా. ఆత్మకథల్లో ఎన్నదగిన ఈ పుస్తకానికి కొనసాగింపుగా వచ్చిన (ఇం)కోతి కొమ్మచ్చి లో మొదట ఉన్న ఒరవడి తగ్గినప్పటికీ పాఠకులకి తృప్తినిచ్చే రచన. ఇక, మూడోభాగం 'ముక్కోతి కొమ్మచ్చి' బాపూ-రమణల వీరభిమానులని మినహా, మిగిలిన పాఠకుల్లో చాలామందిని నిరాశ పరిచింది. రమణ రాయని విషయాలని చెప్పేందుకు మొదలైన ఈ 'కొసరు కొమ్మచ్చి' నిజానికి బాపూ-రమణల వ్యక్తిత్వాలని, వాళ్ళ మధ్యా, వాళ్ళ కుటుంబాల మధ్యా ఉన్న స్నేహాన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించే రచన.

బాపూ వ్యాసం, శీర్షికలోనే చెప్పినట్టుగా వాళ్ళ సినిమాల గురించిన విశేషాల సమాహారం. తన పట్టుదల కారణంగా తీసిన 'బంగారు పిచిక' సినిమాని, కొన్ని దశాబ్దాల తర్వాత రమణ పట్టుదల కారణంగా 'పెళ్ళికొడుకు' గా మళ్ళీ తీయాల్సి వచ్చిందని చెప్పారు బాపూ. కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన సరదా సంగతులు మెరిశాయి ఈ వ్యాసంలో. 'ఏడుపొస్తున్నప్పుడు నవ్విన హీరో' అంటూ శ్రీమతి శ్రీదేవి రాసిన వ్యాసం ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా, వీటన్నింటికీ మించి బాపూ ఆప్తుడిగా రమణ ఏమిటి అన్నది చెబుతుంది. వృత్తినీ, కుటుంబాన్నీ రమణ బ్యాలన్స్ చేసిన తీరు తెలుస్తుంది పాఠకులకి.


'నాన్నా-నేనూ' అంటూ వరా ముళ్ళపూడి, 'నాన్న మామ మేము అను తోకకొమ్మచ్చి' ముళ్ళపూడి అనూరాధ తండ్రి జ్ఞాపకాల్ని రాసుకున్నారు. మామ అంటే బాపూ. వరా బాపూ దగ్గర సహాయ దర్శకుడు కూడా. అనూరాధ వ్యాసం మళ్ళీ మళ్ళీ చదివించేదిగా ఉంది. తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తే ఆమె ఓ మంచి రచయిత్రి అవుతారు అనిపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ ని రమణ ఎంత సమర్ధవంతంగా నిర్వహించారో చెప్పే వ్యాసాలివి. అలాగే, పిల్లల పెంపకం మీద బాపూ రమణల శ్రద్ధ, వాళ్ళ ఇష్టాలని పిల్లల మీద ఏమాత్రం రుద్దకపోవడం, అలాగే పిల్లలకి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెనక నిలబడడం లాంటివి తండ్రులుగా వాళ్ళమీద గౌరవాన్ని పెంచుతాయి.

'ఒక అభిమాని ప్రస్థానం' అంటూ ఎమ్బీఎస్ ప్రసాద్ రాసిన వ్యాసంలో బాపూ-రమణల పట్ల భక్తిభావం కనిపిస్తుంది. "ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో సాహిత్యం ఎంత?" అన్న ప్రశ్నకి జవాబు దొరుకుతుందీ వ్యాసంలో. ఎందుకంటే, ఆ సర్వస్వానికి సంపాదకుడు ఈ వ్యాసకర్తే. అనేకానేక మారుపేర్లతో రమణ చేసిన రచనలని సేకరించి, సంపుటాలుగా వెలువరించిన క్రమాన్ని విశదంగా రాశారు ప్రసాద్. దానితో పాటే బాపూ-రమణలతో మొదలైన పరిచయం, అనుబంధంగా మారిన క్రమాన్నీ వివరించారు. ఓ అభిమాని కళ్ళతో రమణని చూడ్డానికి ఉపకరించే వ్యాసం ఇది.

ఇక పుస్తకంలో చివరిదీ, సుదీర్ఘమైనదీ సీతారాముడు అను బీవీఎస్ రామారావు రాసిన 'ఇస్కూలు నుంచి బైస్కోపుల దాకా.. రమణతో ప్రయాణం.' నూట అరవై ఏడు పేజీల ఈ వ్యాసం ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఈ ఒక్క వ్యాసం కోసం ఈ పుస్తకం చదవొచ్చు. రమణతో చిన్ననాటి స్నేహం మొదలు, రమణ చివరి రోజులవరకూ ఓ క్రమంలో రాశారు రామారావు. రమణని గురించి చాలా నిర్మొహమాటంగా రాశారీయన. 'మూగమనసులు' మొదలుకొని, గోదారి ఒడ్డున తీసిన రమణ సినిమాలు అన్నింటి వెనుకా ఈ ఇరిగేషన్ ఇంజినీరుగారి కృషి ఉంది. అనేక కథా చర్చల్లో పాల్గొనడమే కాదు, కొన్ని సినిమాలకి కీలకమైన మలుపులు ఈ 'గోదావరి కథలు' రచయిత సూచించినవే. ('హాసం' ప్రచురణలు, పేజీలు  277, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు:

  1. ఈపుస్తకం నేను కినిగె లొ కొనుక్కుని చదివాను.... చాలా బాగుంది.... కొన్ని వ్యాసాలు విసిగించినా మొత్తమ్మీద బాగుంది...

    రిప్లయితొలగించండి